|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:38 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి కాపాడారు. బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 191లో ఉన్న 10 ఎకరాల భూమిని హైడ్రా గురువారం స్వాధీనం చేసుకుంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర సుమారు రూ. 750 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.కొంతకాలంగా ఈ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. విచారణలో భూ కబ్జా వాస్తవమేనని నిర్ధారించుకున్న తర్వాత చర్యలకు ఉపక్రమించింది.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా, అక్కడ ఉన్న శాశ్వత నివాసాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు, ప్రహరీ గోడలను అధికారులు కూల్చివేశారు.అనంతరం, స్వాధీనం చేసుకున్న 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.