|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:48 PM
తెలంగాణను కేవలం స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కాకుండా ఆ కంపెనీలు యూనికార్న్ (Unicorn - 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీ) కంపెనీలుగా ఎదిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం రూ. 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్టార్టప్‌ల విజయానికి అవసరమైన అంశాలను వివరించారు. తాను ఫుట్‌బాల్ ఆడతానని.. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరమని చెప్పారు. పట్టుదలతో సాధన చేయాలని.. చివరకు గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. స్టార్టప్‌లు కూడా అదే విధంగా సమిష్టిగా, పట్టుదలతో, విజయం లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌కు అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువ స్టార్టప్ వ్యవస్థాపకులలో స్ఫూర్తి నింపేందుకు గూగుల్ ఆవిర్భావ కథను గుర్తు చేశారు. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో స్టార్టప్‌ను ప్రారంభించారన్నారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని వ్యాఖ్యానించారు. యువకులు కూడా అటువంటి కలలను సాకారం చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలనే సంకల్పంతోనే తాము గత రెండు రోజులు 'తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్'ను నిర్వహించామని సీఎం తెలిపారు. రూ. 1,000 కోట్ల స్టార్టప్ ఫండ్‌తోపాటు, టీ-హబ్ వంటి ఇన్‌క్యుబేటర్ల ద్వారా తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టంను మరింత బలోపేతం చేసి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం హైకమాండ్‌కు నివేదికను అందజేయనున్నారు.