|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:19 PM
హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరంలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఐటి రంగం మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ హైదరాబాద్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది.గత పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ప్రాంతాలు ఈ అభివృద్ధికి కీలక కేంద్రాలుగా మారాయి.హైదరాబాద్‌లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి అంతర్జాతీయ కంపెనీలు స్థిరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశీయ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అమెజాన్ సంస్థ ఇప్పటికే సుమారు రూ. 36,000 కోట్లు పెట్టుబడితో భారీ డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టింది. భవిష్యత్తులో మరో రూ. 60,000 కోట్ల పెట్టుబడితో సేవల విస్తరణకు సిద్ధమవుతోంది.రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్‌పేటలోని కందుకూరులో సుమారు 48 ఎకరాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా జరగనుంది. దాంతో భూముల విలువలు పెరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ ప్రాంతం ఫార్మా సిటీకి సమీపంలో ఉండడం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది.రంగారెడ్డి జిల్లా చందనవెల్లి (షాబాద్) వద్ద మైక్రోసాఫ్ట్ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఈ ప్రాంతం భారీ IT-డేటా ఇన్‌ఫ్రా జోన్‌గా మారే అవకాశం ఉంది.అదేవిధంగా, రావిర్యాలలో ఫ్యాబ్ సిటీ సమీపంలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఈ అభివృద్ధి పరిశీలిస్తే, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతం హైదరాబాద్ ప్రధాన IT-డేటా హబ్‌గా ఎదగడం ఖాయమని విశ్లేషకులు పేర్కొన్నారు.