|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:16 PM
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మొదటి విడతలో భాగంగా 4,236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,834 సర్పంచ్ పదవుల కోసం 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక గ్రామ పంచాయతీ, పది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ ఎన్నికల్లో మొత్తం 56,19,430 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మూడు విడతల కోసం కలిపి 93,905 మంది సిబ్బందిని, 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సున్నితమైన ప్రాంతాల్లోని 3,461 పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.