|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:18 PM
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన విమర్శలకు త్వరలోనే ఆధారాలతో సమాధానమిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సమాధానం ఇస్తానని ఆమె ప్రకటించారు. కృష్ణారావు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ తనలోని ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.‘జాగృతి జనం బాట’లో భాగంగా నిన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను కూకట్‌పల్లిలో 15 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలనే ప్రస్తావించానని, దానికి కృష్ణారావు వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఆయన అవినీతి పనులను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ఆయన మాటలకు తానేమీ బాధపడటం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం యూసుఫ్‌గూడలోనూ పర్యటించిన కవిత, "కృష్ణారావు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆడాల్సిన టెస్టులు ఇంకా ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా ఆమె బోయినపల్లిలోని రామన్నకుంట చెరువును, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మనోవికాస్‌నగర్‌లోని ‘ఎన్‌ఐఈపీఐడీ’ సంస్థలో దివ్యాంగ విద్యార్థులతో కవిత ముచ్చటించారు.