|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:54 PM
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కొత్తగా టెన్షన్ పెరిగింది. పిల్లలకు రోజూ పాఠాలు చెప్పే టీచర్లు… ఇప్పుడు టెట్ పుస్తకాలతోనే కుస్తీ పడే పరిస్థితి వచ్చింది.ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి రావడంతో 45,742 మంది టీచర్లు ఈసారి పరీక్ష రాయకుండా మార్గం లేకుండా పోయింది. పరీక్షకు కేవలం 45 రోజులే మిగిలి ఉండటం, పైగా సిలబస్‌లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వగా… నెలన్నరలోపు సిద్ధం కావడమే సవాల్‌గా మారింది. విధులు, కుటుంబ బాధ్యతలు, సిలబస్ ఒత్తిడి మధ్య ఈ పరీక్షను క్లియర్ చేయడం చాలా కష్టమని పలువురు చెబుతున్నారు.సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేల మంది టీచర్లు ప్రభావితులవుతున్నారు. కొత్త నియామకాలకు మాత్రమే కాకుండా పదోన్నతులకు కూడా టెట్ అర్హత కావాల్సి రావడంతో ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవాళ్లు కూడా పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు. గతంలో డీఎస్సీ ద్వారా ఎంపికైన, టెట్ నుంచి మినహాయింపు ఉన్న ఉపాధ్యాయులూ ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చారు.సాధారణంగా టెట్‌లో ఉత్తీర్ణత శాతం తక్కువగానే ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసిన యువతలోనే పాస్ రేటు తక్కువగా ఉండగా… దశాబ్దాల క్రితం సర్వీస్‌లో చేరిన టీచర్లకు ఇది ఇంకా కఠినంగా మారింది. అప్పటి సిలబస్ వేరు, ఇప్పటి విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా విద్యార్థుల మానసిక స్థితి, నూతన విద్యా విధానంపైనే ప్రశ్నలు వస్తుండటంతో ఇన్‌సర్వీస్ టీచర్లకు అవగాహన తక్కువగా ఉంది. సైన్స్ టీచర్ గానీ, మ్యాథ్స్ టీచర్ గానీ తమ సబ్జెక్టులో మాత్రమే నైపుణ్యం కలిగి ఉండటంతో ఇతర సబ్జెక్టులు రాయడం కష్టంగా ఉంటుందని వారు చెబుతున్నారు. యువ అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం, ఆన్‌లైన్‌లో సులభంగా మెటీరియల్ అందుబాటులో ఉండటం వారికి అడ్వాంటేజ్‌గా మారుతోంది. ఈ అంశాలన్నీ సర్వీస్ టీచర్లలో భయాన్ని పెంచుతున్నాయి.
*మినహాయింపు కోరుతున్న ఉపాధ్యాయులు :టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందని టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. టెట్ సమస్యపై కేంద్ర విద్యా శాఖ మంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కూడా వారు కలిసి ప్రతిపాదనలు అందిస్తున్నట్లు చెప్పారు. గత 15 ఏళ్లుగా సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని ప్రభుత్వాలు చెప్పిన నేపథ్యంలో… కనీసం 2011కు ముందున్న టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే అనేక మంది టీచర్లు టెట్ కోసం సెలవులు పెట్టి సిద్ధం అవుతున్నారు. “తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల దగ్గరే ఇప్పుడు పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని చాలామంది టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు. టెట్ దృష్ట్యా కొన్ని కోచింగ్ సెంటర్లు, సంస్థలు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాయి. విద్యాశాఖ జనవరిలో టెట్ పరీక్ష నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మరింత పెరిగింది.