|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:05 PM
బంగారం ధరల గురించి అందరూ మాట్లాడుకుంటున్న వేళ, వెండి అనూహ్యంగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర చారిత్రక గరిష్ఠమైన రూ.2 లక్షల మార్కుకు అత్యంత చేరువగా వచ్చింది. బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1.92 లక్షలు పలికి, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ అనూహ్య పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు, పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర చరిత్రలో తొలిసారిగా ఔన్సుకు 60 డాలర్ల మార్కును దాటింది. బుధవారం ట్రేడింగ్‌లో ఔన్సు వెండి ధర 61.49 డాలర్ల వద్దకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే ఈ లోహాలపై పెట్టుబడులు పెరిగి, వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇదే ప్రస్తుత ధరల పెరుగుదలకు తక్షణ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.