|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:53 PM
విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఆ రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ.. వాటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, బుధవారం, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థులకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధి కోసం రూ. 45 లక్షల చెక్కును అందజేశారు. ఆ తర్వాత.. ఆర్ట్స్ కాలేజీ వద్ద 'సర్వం సిద్ధం' పేరుతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో.. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికే తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులను ఓయూ స్టూడెంట్స్ అడ్డుకున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తాను ఎందుకు ధైర్యం చేసి ఓయూకు వెళ్తున్నావని.. కొందరు తనను ప్రశ్నించారని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చింది ధైర్యంతో కాదని, విద్యార్థుల గుండెల్లో తన మీద ఉన్న అభిమానంతో వచ్చానని అన్నారు. తన మనసులో ఉన్నది చెప్పడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు.
దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి అన్నారు సీఎం రేవంత్. ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని అభివర్ణించారు. మేధావుల సూచనలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో చదువు లేకపోయినా ఆధిపత్యాన్ని సహించరని సీఎం స్పష్టం చేశారు. ఓయూకు రూ. 1000 కోట్ల నిధులు విడుదల చేయడం, పూర్వ విద్యార్థులు రూ. 45 లక్షల చెక్కు అందించడం వంటివి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.