|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 10:23 PM
దివంగత కాంగ్రెస్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పి. జనార్థన్‌రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం బోరబండ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు.
పీజేఆర్ పేరుతో బోరబండ చౌరస్తా..
బోరబండ ప్రాంతంలోని ప్రధాన చౌరస్తాకు ఇకపై 'పీజేఆర్ బోరబండ చౌరస్తా'గా నామకరణం చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా.. ఆ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దాన్ని స్వయంగా తానే ఆవిష్కరిస్తానని సీఎం ప్రకటించారు. ఈ గౌరవం పీజేఆర్ ప్రజల్లో సంపాదించిన అభిమానానికి.. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకు నివాళి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవలే కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించిన పి. జనార్థన్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చౌరస్తాకు ఆయన పేరు పెట్టడం, ఆ దివంగత నేతకు తమ ప్రభుత్వం ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతను తెలుపుతోంది.
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పీజేఆర్ మరణించినప్పుడు.. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి.. ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేసేందుకు చంద్రబాబు , బీజేపీ కూడా గౌరవం చూపారని సీఎం గుర్తుచేశారు. కానీ.. అప్పుడు కేసీఆర్ ఒక్కరే ఒప్పుకోలేదన్నారు.