|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 06:42 PM
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్ల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. పదికి మించి ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయిన వాహనదారులపై.. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఆపరేటర్లు , ద్విచక్ర వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులు నిర్ణయించారు. ఇటువంటి వాహనాలను తక్షణమే సీజ్ చేయడం తో పాటు.. బకాయిలను వసూలు చేయడానికి పోలీసు బృందాలు నేరుగా యజమానుల నివాసాలకే వెళ్తారని స్పష్టం చేశారు.
కర్నూలులో ఇటీవల జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం ఈ కఠిన చర్యలకు కారణం అయింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న బస్సుకు దాదాపు రూ. 40,000 విలువైన పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ (ఆర్టీఏ)అధికారులతో సమన్వయం చేసుకుని.. వాహన కేటగిరీల వారీగా పెండింగ్ చలాన్ల వివరాలను విభజించాలని నిర్ణయించారు.
మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ టి. సాయి మనోహర్ మాట్లాడుతూ.. అతివేగం, నో-పార్కింగ్, రెడ్ లైట్ జంపింగ్ వంటి ఉల్లంఘనలను ‘భారీ వాహనాలు’ అనే వర్గంలో నమోదు చేయడం వల్ల.. ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక డేటాబేస్ లేదని తెలిపారు. ‘మేము ఆర్టీఏ అధికారులతో కలిసి ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్, ఆటో రిక్షాలు, ట్రావెల్ బస్సులు .. ఇతర భారీ వాహనాలకు సంబంధించిన వివరాలను విభజిస్తామన్నారు. ఈ డేటా అప్‌డేట్ అయిన తర్వాత ఉల్లంఘనదారులను గుర్తించడం చాలా సులభం అవుతుందని ఆయన వివరించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొదటిసారిగా పెండింగ్ చలాన్ల డేటాను ప్రతిరోజూ విశ్లేషించడానికి , భారీ బకాయిలు ఉన్న వాహనాలను.. ముఖ్యంగా తెలంగాణ , పొరుగు రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన ప్రైవేట్ బస్సులను ట్రాక్ చేయడానికి 20 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించిన వెంటనే.. ఈ బృందాలు వాహన యజమానులను పట్టుకుని... వారి నివాసాలకే వెళ్లి జరిమానాలను వసూలు చేస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఉన్న వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు.
ఇటీవల.. రూ. 35,000 విలువైన 40కి పైగా పెండింగ్ చలాన్లు ఉన్న ఒక ఫోర్ వీలర్ వాహన యజమానిని బెంగళూరులో గుర్తించారు. వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరచుగా ప్రయాణించే ఆ యజమాని.. ఒన్-వే రోడ్లలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. పోలీసు బృందం అతన్ని సైబరాబాద్‌కు రప్పించి పెండింగ్‌లో ఉన్న బాకాయిలను అన్నీ చెల్లించేలా చేసింది.
రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు హైదరాబాద్ , సైబరాబాద్ నుంచే నడుస్తున్నందున.. మూడు కమిషనరేట్ల మధ్య సమన్వయం చాలా కీలకమని అన్నారు. తాము ప్రధాన చౌరస్థాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి.. రిజిస్ట్రేషన్ నెంబర్‌లను ధృవీకరించి .. ఎక్కువ ఉల్లంఘనలు ఉన్న ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుంటాము. ఇది ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది అని ఆయన తెలిపారు.
ఆర్టీఏ అధికారి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. మోటారు వాహనాల చట్టం కింద ఉల్లంఘనదారులను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కర్నూలు ప్రమాదం దృష్ట్యా .. చలాన్ డేటాను వాహన రకం ప్రకారం వర్గీకరించి.. ట్రాఫిక్ పోలీసుల డేటాబేస్‌లతో అనుసంధానించడానికి ప్రభుత్వ ఆమోదం కోసం ఒక ప్రతిపాదనను సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా.. పొరుగు రాష్ట్రాలలో రిజిస్టర్ అయి తెలంగాణలో పెండింగ్ చలాన్లు ఉన్న అనేక ట్రావెల్ బస్సుల విషయంలో.. బకాయిలు చెల్లించే వరకు వాహన రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను నిరాకరించాలని ఆయా రాష్ట్రాల రవాణా అధికారులకు లేఖ రాయాలని ఆర్టీఏ యోచిస్తోంది.