|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 07:16 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 24 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆ శాఖ అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇలాంటివి జరగకుండా రవాణాశాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేవెళ్ల ఘటనలో.. రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నా.. ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణాశాఖ కమిషనర్‌తో పాటు తదితర రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాహనాలకు స్పీడ్ లాక్ రూల్ ఎంతవరకు అమలవుతుందో చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ స్పీడ్ లాక్ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే.. మూడింతలు పెనాల్టీ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నిబంధనలను రవాణాశాఖ అధికారులు సీరియస్‌గా అమలు చేయాలన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాదని.. నిరంతరం అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్‌తో కఠినంగా వ్యవహరించాలన్నారు. రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల పైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో.. కఠినంగా వ్యవహరిస్తేనే.. రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు.
చేవెళ్ల ప్రమాదంలో టిప్పర్‌లో ఉన్న కంకర.. బస్సులోని ప్రయాణీకులపై పడింది. చాలా మంది కంకర కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో టిప్పర్ లారీలు.. ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు.. టార్పలిన్ కప్పుకొని తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ చెప్పారు. డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో.. మూడు బృందాలుగా ఏర్పడి.. నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపుకు ఉపయోగించే.. వాహనాలను వేధించొద్దని సూచించారు. ప్రజలను వేధించకుండా.. రవాణాశాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. శాఖలో కొత్తగా వచ్చిన ఉద్యోగులతో సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి సూచించారు.
వారిపై కఠిన చర్యలు..
ప్రయాణికుల వాహనాలతో పాటు నిబంధనలు పాటించని కమర్షియల్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు.. అదే వాహనంలో కార్గో సరుకులు తరలించినా కఠినంగా వ్యవహరించాలన్నారు. స్కూల్ బస్సులు, ట్రక్కులు, టిప్పర్‌లు లారీలు వంటి వాటికి ఫిట్‌నెస్, పర్మిట్‌లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.