|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 06:50 AM
హిట్లర్ వంటి పెద్ద పెద్దవారే చరిత్రలో కలిసిపోయారు, ఇక నువ్వెంత రేవంత్ రెడ్డి, నీ బ్రతుకెంత అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో రోడ్ షో నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లికి వచ్చిన బుల్డోజర్ రేపు జుబ్లీహిల్స్‌కు రాకుండా ఉండాలంటే మాగంటి సునీతను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.మాగంటి సునీత ఒక ఆడపిల్ల అని, ఆమె కష్టమొచ్చి చెప్పుకుంటే, బయటకు వస్తుందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, కానీ ఆమెకు తామంతా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి, తాను ఆమెకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పక్కనే తెలంగాణ భవన్ ఉందని, అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధగంటలో మీ ముందు ఉంటామని, కాంగ్రెస్ నాయకులు వచ్చి గూండాగిరి చేస్తే గల్లా పట్టి నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఓటు వేయకుంటే పథకాలు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, అది రేవంత్ రెడ్డి సొంత డబ్బుతో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. హైడ్రా బాధితులను చూస్తే ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేశారని ఆయన మండిపడ్డారు. హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే కారు గుర్తుకు ఓటేసి సునీతను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరిని కూడా మోసం చేయకుండా విడిచిపెట్టదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా అమలు చేయడం లేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చినందుకు పేదల ఇళ్లు కూలగొట్టారని ఆయన ఆరోపించారు.