|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 05:48 PM
హైదరాబాద్ మహానగరంలో కో-లివింగ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. వృత్తి ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువ నిపుణులకు, విద్యార్థులకు ఈ కో-లివింగ్ వసతులు సులభమైన నివాస మార్గాన్ని అందిస్తున్నా, కొన్నిచోట్ల ఈ వసతి గృహాలు డ్రగ్స్ అక్రమ రవాణాకు, వినియోగానికి కేంద్రాలుగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కో-లివింగ్ అనేది పాశ్చాత్య దేశాల నుంచి లేటెస్ట్ ట్రెండ్. ఇందులో ఎక్కువ మంది వ్యక్తులు ఒకే భవనంలో, ఒకే రూమ్‌లో లేదా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తారు. అద్దెను, ఇతర ఖర్చులను పంచుకోవడం వంటివి చేస్తుంటారు. సాధారణంగా దీనిలో ఇంటర్నెట్, హౌస్ కీపింగ్, కిచెన్ రూమ్ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.
ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఐటీ నగరాల్లో పనిచేసే యువత తక్కువ అద్దెకు, పూర్తి సౌకర్యాలతో నివసించడానికి ఈ విధానాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓ కాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌పై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న వారితో సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్ (సరఫరాదారులు), ఆరుగురు కన్జ్యూమర్స్ (వినియోగదారులు) ఉన్నారు.
కర్ణాటక నుంచి గుత్తా తేజ అనే వ్యక్తి.. ఒక నైజీరియన్ సహాయంతో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఎండీఎంఏ, గంజాయితో పాటు పలు రకాల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కో-లివింగ్ కేంద్రాలతో పాటు, డ్రగ్స్ దందా సామాన్య నివాసాలను కూడా వదలడం లేదు. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్ అనే వైద్యుడి ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించి రూ. 3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.
ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు వ్యక్తులు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి, వాటిని జాన్‌పాల్ ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. డ్రగ్స్‌ను తమ ఇంట్లో ఉంచినందుకు గాను ఆ వైద్యుడికి ఉచితంగా డ్రగ్స్‌ను అందిస్తున్నారు. వీరి నివాసంలో ఓజీకుష్, కొకైన్, హాష్ ఆయిల్ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ దొరికాయి. ఈ వరుస దాడులు హైదరాబాద్‌లో పెరుగుతున్న డ్రగ్స్ ప్రమాదాన్ని, సరఫరాదారుల నెట్‌వర్క్‌ను సూచిస్తున్నాయి. యువత, నిపుణులే లక్ష్యంగా ఈ దందా జరుగుతుండటంతో పోలీస్, ఎక్సైజ్ శాఖలు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.