అసలే వర్షాకాలం.. అందులోనూ మొన్నటివరకు భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు ఆవరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా.. వైరల్ ఫీవర్లు, సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతుండటం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్.. కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లా్ల్లో డెంగ్యూ, చికున్ గున్యా కేసులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఈ నాలుగు జిల్లాలు.. మొన్నటి భారీ వర్షాలకు ఎక్కువగా ప్రభావితం కావటంతో.. వైరల్ ఫీవర్లు, సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, చికున్ గున్యా కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వ్యాధులు ప్రభలకుండా ఉండేలా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని సూచించింది.
అయితే..తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పరిశీలన ప్రకారం.. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ.. చికున్‌గున్యా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందని తేలింది. ఫ్లూ ఏ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ), ఎంటెరిక్ ఫీవర్ వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా విపరీతంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. డెంగ్యూ కేసుల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించారు. ఆగస్టు 23ల తేదీన 4459 కేసులుండగా.. ఆగస్టు 30 నాటికి ఆ సంఖ్య 6242 కి చేరుకుంది. ఇందులో.. ప్రధానంగా.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఖమ్మంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
అయితే.. హైదరాబాద్‌లోని కొందరు.. చికున్‌గున్యాను డెంగ్యూ అని తప్పుగా భావిస్తూ అనవసరమైన ఆందోళనకు గురవుతున్నట్టుగా పలువురు వైద్యులు చెప్తున్నారు. దానికి కారణం.. రెండు వ్యాధుల్లోనూ.. అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉండటమే కారణమని భావిస్తున్నారు. దీంతో.. ఎలాంటి టెస్టులు లేకుండా స్వయంగా నిర్దారించుకోవటమే కాకుండా.. లక్షణాల ఆధారంగా స్వీయ చికిత్స కూడా చేసుకుంటున్నారు. ఫలితంగా.. కొందరిలో సమస్యలు జటిలమవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో ముఖ్యంగా చిన్నారుల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. నగరంలోని ఆసుపత్రుల నివేదికల ప్రకారం.. దాదాపు 20 శాతం మంది రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉంటుండటం గమనార్హం. మిగిలిన 80 శాతం మంది ప్రాథమిక చికిత్సతో ఇంట్లోనే కోలుకుంటున్నారు.
మరోవైపు.. వైద్యులు, ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల పెరిగిన అవగాహన, ముందస్తుగా గుర్తించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన నివారణ చర్యలతో.. డెంగ్యూ సోకినప్పటికీ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. డెంగ్యూ లాంటి వ్యాధులను నివారించాలంటే.. అలాంటి చర్యలు ఇంటి నుంచే మొదలవుతాయని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. డెంగ్యూ, చికున్‌గున్యా రెండింటి ప్రమాదాన్ని తగ్గించడానికి ఖాళీ నీటి పాత్రలు, కాలువలను శుభ్రపరచడం, దోమలను నివారించే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa