కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. 8 కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని రంజోల్ వద్ద ఆదివారం (నవంబర్ 10) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నికి ఆహుతైన కార్లలో 4 నెక్సాన్ వాహనాలు ఉన్నాయి. అన్నీ విలువైన కార్లేనని తెలుస్తోంది. రూ. 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. టాటా కంపెనీకి చెందిన కార్లను ముంబై నుంచి హైదరాబాద్ షోరూమ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కంటైనర్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చి, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇంజిన్ నుంచి వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. కొత్త కార్లకు మంటలు అంటుకొని ఒక్కొక్కటీ దగ్ధమయ్యాయి. ఇంజిన్‌లో మంటలు వెలువడగానే.. కంటైనర్ ఆపేసి, కిందకి దూకాడు డ్రైవర్. అనంతరం ఎమర్జెన్సీ ఫోన్ నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. అగ్నిమాపక యంత్రంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బందితో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఫైరింజన్, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చాలాసేపు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. రహదారిని తాత్కాలికంగా మూసివేసి సహాయక చర్యలు కొనసాగించారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి?
అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ లేదా అధికంగా వేడెక్కడం కారణంగా మంటలు వ్యాపించి ఉండొచ్చునని డ్రైవర్ తెలిపాడు. కచ్చితమైన కారణాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను వాహనదారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.