బాల్యంలో పిల్లలకు చదువు మీది కంటే ఆటలపైనే శ్రద్ధ ఎక్కువ. సండే ఎప్పుడోస్తుందా.. దోస్తులతో రోజు మొత్తం క్రికెట్ ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటారు. అయితే.. విద్యార్థులకు చదువూ ముఖ్యమే.. అటు ఆటలూ అవసరమే. కానీ ఇప్పుడున్న విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఒత్తిడితో.. చాలా మంది పిల్లలను బట్టి చదువులకు అలవాటుపడుతూ.. ఆటలకు దూరమవుతున్నారు. దీంతో.. కొంతమంది పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకోలేక.. తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వెళ్లనివ్వక.. తాము పెట్టుకున్న లక్ష్యాలకు ప్రోత్సాహం దొరకక తమలో తామే ఒత్తిడికి గురవుతున్నారు. అలా మథన పడిన ఓ విద్యార్థి.. తమ తల్లిదండ్రులకు లేఖ రాసిపెట్టి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవటం ఇప్పుడు పేరేంట్స్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఓ బాలుడు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ తన మనోగతాన్ని లేఖ రూపంలో తన తల్లిదండ్రులకు తెలియజేశారు. ఓవైపు తన తల్లిదండ్రులు తనపై చూపే శ్రద్ధను చెప్తూనే, క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని కూడా వివరించాడు. అయితే.. చదువే సర్వస్వం.. చదువుకుంటే బాగుపడతావంటూ మంచి మాటలు చెప్తున్నారు సరే కానీ.. తనకు క్రికెట్ మీద ఉన్న ఆసక్తిని గుర్తించట్లేదని.. తాను ఓ గొప్ప క్రికెటర్ అవ్వాలని పెట్టుకున్న లక్ష్యంవైపు ప్రోత్సహించట్లేదన్న విషయాన్ని చాలా సున్నితంగా చెప్పుకొచ్చిన తీరు.. అందరినీ ఆలోచనలో పడేస్తోంది.
అసలు ఆ బాలుడు ఏం రాశాడో అతని మాటల్లోనే..
"నేను ఈ రోజు వెళ్లిపోతున్నా.. నాకు చదువులో కన్న క్రికెట్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. నాకు చదువు రాదని కాదు, నాకు చదువు వచ్చు కానీ మరీ ఎక్స్‌ట్రార్డ్‌నరి కాదు. నాకు అన్ని కల్పించారు దానిలో ఏది లోటు చేయలేదు. నేను మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకొని కష్టపడకుండా ఉండాలని మీ ఆశ, అది నేను అర్థం చేసుకోగలను, మీరు కష్టపడినట్లు నేను కష్టపడొద్దని మీ ఆలోచన, మీ కష్టం గురించి నాకు తెలుసు కానీ నాకు క్రికెట్ అంటే ఇష్టం, కానీ మీరు నన్ను అందులో ప్రోత్సహించడం లేదు, దానికి కారణం కూడా ఉంది కానీ నా గురించి కూడా ఆలోచించండి, మీరు నన్ను ఏ పని చేసినా కష్టపడి, మనం అందులో ఫస్ట్ ఉండాలని చెబుతారు. నేను క్రికెట్‌లో కష్టపడుతాను. నేనే ఫస్ట్ ఉండటానికి ప్రయత్నిస్తాను.
కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. డాడీ నీకు ఎలాగైతే స్కూల్‌కి షూ వేసుకొని వెళ్లాలని నీ డ్రీమ్.. నాకు కూడా క్రికెటర్ అవ్వాలని డ్రీమ్, డాడీ నీకు స్టేజీపై ఎలాగైతే మెడల్స్ తీసుకోవాలని ఉందో నాకు కూడా అలాగే స్టేజీపై కప్ తీసుకోవాలని నా ఆశ, నేను క్రికెట్ కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధం.. నేను దాన్ని నా ప్రాణం పెట్టైనా ఆడతాను. అందుకే నేను వెళ్లిపోవడానికి సిద్దపడ్డాను. క్రికెట్‌లో కూడా ఎక్కువగానే కాంపిటీషన్ ఉంది. దాన్ని దాటి పైకి ఎదగడం చాలా కష్టమే, క్రికెటర్ అవ్వాలని ఆశతో చాలా మంది జీవితాలు కరాబు అయుండొచ్చు, కానీ నేను వాళ్లలాగా కాదు, నేను అనుకున్నది సాధించే వరకు పట్టు వదలను, క్రికెట్ కూడా ఒక మంచి ఉద్యోగం లాంటిదే. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మీకు నేను ఎలాగైతే చాలా ఇష్టమో నాకు కూడా క్రికెట్ అంతే ఇష్టం.
నేను వెళ్లిపోయానని బాధపడకండి. నేను మళ్లీ మంచి క్రికెటర్ అయ్యాక తిరిగి వస్తాను, నన్ను చూడకుండా ఉండలేరని నాకు తెలుసు, కానీ నాకు ఇంకో దారి లేదు, నేను నా బట్టలు తీసుకొని వెళ్తున్న." అంటూ ఆ బాలుడు తన తల్లిదండ్రులకు లేఖ రాసి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ లేఖ చూసిన వాళ్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఆ బాలునికి క్రికెట్ మీద ఉన్న ఇష్టం సరైనదే.. వాళ్ల పేరేంట్స్ ఆశ కరెక్టే.. కానీ ఫ్యామిలీ పరిస్థితులు కూడా ముఖ్యమే కదా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇలా క్రికెట్ మీద ఇష్టంతో వెళ్లిపోయి తన మీదే ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులను బాధపెట్టటం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది పేరేంట్స్ ర్యాంకులు ర్యాంకులు అని.. మనసులోని ఇష్టాలను పట్టించుకోవట్లేదని ఇంకొందరు చెప్తే.. ఇలా చదువునే టైంలో బయటకు వెళ్లి తన ఇష్టాన్ని సాధించటమనేది ప్రాక్టికల్‌గా వర్కవుట్ అయ్యే విషయం కాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ బాలుడు అలా ఇంట్లో నుంచి వెళ్లిపోవటమనేది సరైన నిర్ణయం కాదన్నది ఎంత నిజమో.. ఆ బాలుడు లేఖలో రాసిన విషయాలు చాలా మంది తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉన్నాయన్నది కూడా అంతే నిజం..!