నిబంధనలను ఉల్లంఘించి కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న సీఎం చంద్రబాబు, దాన్నిప్పుడు అధికారిక నివాసంగా ప్రకటించుకోవడం దేనికి సంకేతమని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వ విధానం ఇదేనా, చట్టాలను పరిరక్షించాల్సిన వ్యక్తే ఉల్లంఘించడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టి సారించి చంద్రబాబు ఇంటి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసానికి సంబంధించి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది.
కరకట్ట మీద ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంటినే అధికారిక నివాసంగా ప్రకటించింది. నది ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ, దాన్ని అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని ఏ విధంగా పరిగణించాలి?. ఏకంగా సీఎం నిబంధనలు ఉల్లంఘించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.