డీఎస్సీ పేరుతో 1.87 లక్షల నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దగా చేసిందని, రోజుకో ప్రకటన పేరుతో వాయిదాలు వేస్తున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాడిస్ట్ ప్రభుత్వమని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. టీవీలు, పేపర్లకు లీకులిస్తూ టీచర్ ఉద్యోగాల భర్తీని నిరవధికంగా వాయిదా వేసే కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అయన మాట్లాడుతూ.... చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. అధికారంలోకి రాగానే 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. అధికారం చేపట్టాక మెగా డీఎస్సీ పేరుతో 16,347 పోస్టులు మాత్రమే ప్రకటించారు. టీచర్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ జూన్ 13న మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. దాదాపు 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై టెట్ రాసి, క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎదురు చూస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ అర్హతను పరిగణించకుండా, ఆ టెట్ రద్దు చేసి మెగా డీఎస్సీ పేరుతో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాడు. గత సెప్టెంబరు చివరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ కూడా నీటిమూటగా మారింది. మొన్నటికి మొన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 3 నెలలు సమయం ఇస్తున్నామన్న ప్రభుత్వం నవంబరు 6న నోటిఫికేషన్ ఇస్తున్నామని చివరి వరకు నమ్మించి మళ్లీ వాయిదా వేసింది. మరోసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా జిల్లాలవారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ, విద్యా శాఖను ఆదేశించి, మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారు అని మండిపడ్డారు.