కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రజలకు పథకాలు ఇస్తామని కూటమి పార్టీల హామీలు కోటలు దాటాయి... కానీ వాటి అమలు మాత్రం గడప దాటడం లేదు.
బాబు ష్యూరీటీ - పథకాలు గ్యారెంటీ అన్నారు. కానీ నేడు ఆయన మాటలకు ఎటువంటి వారెంటీ లేదని అర్థమవుతోంది. ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు సీఎంగా చేసిన మోసంకు ఈ ఏడు నెలల పాలన ఏడిపించే పాలనగా ఉందని ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పవన్, చంద్రబాబు, కూటమి నేతలు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ కాస్తా... సూపర్ షాక్ గా మారిపోయింది. మహాశక్తి పథకం... మహామోసంగా, తల్లికి వందనం కాస్తా పిల్లల పాలిట శాపంగా, యువగళం కాస్తా హామీలకు మంగళంగా మారిపోయింది. ఉచిత బస్సు కాస్తా ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది అని అన్నారు.