ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చాలా మంది తమలోని అసమాన ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. అయితే ఇలాంటి ప్రతిభావంతులు ఒకప్పుడు పెద్దగా ప్రపంచానికి తెలిసేవారు కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..? అని మారుమూల పల్లెల్లో ఉన్నవారి టాలెంట్ కూడా ప్రపంచానికి తెలుస్తోంది. ప్రతినిత్యం ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అటువంటి వీడియోనే షేర్ చేశారు.
కంటి చూపులేని ఓ దివ్యాంగుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. శ్రీ ఆంజనేయం సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే సాంగ్‌ను అద్భుతంగా పాడాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. అన్ని పాటలు అప్పట్లో విపరీతంగా సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. కంచి చూపు లేకపోయినా.. దివ్యాంగుడు తన ప్రతిభతో అద్భుతంగా ఆ పాట పాడి బస్సులోని తోటి ప్రయాణికులను అలరించాడు. దివ్యాంగుడు పాడిన పాటను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్ కాగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం స్పందించారు.
యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాట పాడాడంటూ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా.. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్' అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు యువకుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. అతడి ట్యాలెంట్ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఆ యువకుడు నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి చేయూత అందించాలని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. ఇటువంటి వీడియోలను ఎప్పటికప్పడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. సైబర్ క్రైంతో పాటుగా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తుంటారు.