ఇటీవల సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి రీల్స్, వీడియోలు పిచ్చి ఎంతగా పెరిగిపోయిందంటే… సాటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఫోటోలు వీడియోలు తీస్తూ వాటిని వ్యూస్, లైక్స్ కోసం నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలతో రక్తమోడుతుంటే సాయం చేయమని ప్రాధేయపడినా జనాలు పట్టించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీసుకోవడంలో మునిగిపోయారు. ఇంతలో అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన వి. ఏలేందర్ కీసర రాంపల్లి చౌరస్తాలో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రోడ్డపై పడిపోయిన ఏలేందర్ తనను కాపాడాలంటూ అటుగా వెళ్తున్న వారిని చూసి కేకలు వేసి అర్థించారు. గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఏలేందర్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో విలవిల్లాడిపోయిన ఏలేందర్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్నారు.
ఆయన కన్నీళ్లు అక్కడున్న వారిని కదిలించలేకపోయాయి. 108కు సమాచారం అందించి అతడిని ఫొటోలు, వీడియోలు తీస్తూ గడిపేశారు. ఆ తర్వాత 108 వాహనం వచ్చి బాధితుడిని ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.