భైంసా మార్కెట్లో పత్తి కొనుగోలు సజావుగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రైవేటు పత్తి ధర రూ. 6, 850, సీసీఐలో పత్తి ధర రూ. 7, 521 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ప్రైవేటులో రూ. 50 తగ్గింది. సీసీఐలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకు ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర రూ. 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.ఇదిలా ఉంటే జిల్లాలోని పత్తి రైతుల్లో తేమ శాతం గుబులు రేపుతోంది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. లేదంటే ప్రతి అదనపు శాతానికి 75 రూపాయల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో తేమ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కాబట్టి సడలంపును ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు మద్దతు ధర కూడా కనీసం 8 నుండి 9 వేల రూపాయల వరకు ఉంటే బాగుండేదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. కూలీలు, పెట్టుబడుల ఖర్చు అధికమవుతోందని పేర్కొంటున్నారు.