మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. "సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు. కానీ ఏమీ లేదని ఆమె అన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు.. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు. మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ" అని కవిత ఆరోపించారు.సీఎం మెదక్ వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుందని ఆశ పడ్డారు, కానీ సీఎం వస్తే ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ 40 శాతం కు పెరిగి మహిళలకు భద్రత కల్పించడం లేదని అన్నారు. మహిళలకు ఇస్తామన్న పథకాలు ఇవ్వడం లేదని, మహిళా లక్ష్మి పథకం, పెళ్లికి బంగారం, స్కూటీ పై షరతులు లేకుండా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎలాంటి నిబంధనలు లేకుండా అందించాలని, సన్న తో పాటు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెదక్, బోధన్, మెట్టుపల్లి చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని ఇచ్చిన హామీ పై ఎందుకు కదలిక లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి అడ్డమైన కోతలు కోశారని, కోతలు మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.