తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహుని భక్తులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుభవార్త వినిపించారు. ఇప్పటికే.. దేవస్థానంలో రూ.3 కోట్లతో లక్ష్మీనరసింహ స్వామి ధర్మశాల నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆలయ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేయనున్నట్టు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రకటించారు. సోమవారం (జనవరి 20) రోజు.. ధర్మపురి పట్టణంలో రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీకృష్ణ.. రూ.15 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తలాపున గోదావరి ప్రవహిస్తున్న ధర్మపురి పట్టణంలో నీటిఎద్దడి సమస్య ఉండటం బాధకరమని వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయాని వంశీకృష్ణ విమర్శించారు. అమృత్ పథకం కింద రూ.2 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య కోసం కేటాయిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో ధర్మపురిలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామని గుర్తుచేశారు. ధర్మపురి కరకట్ట నిర్మాణం గురించి కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తానని వంశీకృష్ణ తెలిపారు.
మరోవైపు.. పెద్దపల్లి జిల్లాలో తనకు ప్రొటోకాల్ లభించడం లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడిన వంశీకృష్ణ.. తనను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి వేడుకలు కూడా నిర్వహించలేదని అసహనం వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి జరపకపోవడం అంటే దళితజాతిని అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు.
కాకా పోరాటంతోనే నిరుపేదలకు ఇండ్లు వచ్చాయని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కాకా మాత్రం వెనక్కి తగ్గలేదని.. పేదలు, బడుగులకు న్యాయం జరగాలని ప్రతిక్షణం పరితపించేవారని వివరించారు. అన్ని రంగాలకు కాకా స్ఫూర్తి అని తెలిపారు. 50 ఏళ్లలో ఎంతోమంది విద్యావంతులు అయ్యారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాకా ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కాకా రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న సొంత ఇంటిని కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కాకా ఇచ్చేశారని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుడి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని వంశీకృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa