రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను ఘోరంగా వంచిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆశ చూపి, తీరా గద్దెనెక్కిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి వారి శాపం తగలడం ఖాయమని, యువతను మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని కేటీఆర్ హెచ్చరించారు.
వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును కేటీఆర్ తప్పుబడుతూ, అన్నదాతల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు విడతలుగా రైతుబంధు నిధులను విడుదల చేయకుండా సుమారు 70 లక్షల మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, వారిని సాగు పెట్టుబడి కోసం అప్పుల పాలు చేస్తోందని, ఇది ముమ్మాటికీ రైతాంగాన్ని వంచించడమేనని ఆయన అభివర్ణించారు.
మహిళా సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించారని దుయ్యబట్టారు. కేవలం ఓట్ల కోసమే మహిళలకు ఆశలు కల్పించి, ఇప్పుడు వారిని పట్టించుకోకపోవడం కాంగ్రెస్ నైజానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 420 హామీలు కేవలం నయవంచనకు నిదర్శనమని, ప్రజలు ఇప్పటికే ఈ మోసాన్ని గ్రహించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ నిరంతరం ఎండగడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa