సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు పార్టీ శ్రేణులను క్రమశిక్షణ మార్గంలో పెట్టే పనిలో పడ్డారు. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగిస్తూనే, మరోవైపు పార్టీ లైన్ దాటేవారికి పరోక్షంగా గట్టి సంకేతాలు పంపారు. ఎన్నికల బరిలో పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, దానిని ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా రెబల్స్‌గా నామినేషన్లు వేస్తే, వారిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తామని జగ్గారెడ్డి కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అగ్ర నాయకత్వం ఆలోచించి బి-ఫామ్‌లు కేటాయించిందని, ఆ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. వ్యక్తిగత ప్రతిష్టల కంటే పార్టీ విజయమే ముఖ్యమని, క్రమశిక్షణ తప్పే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంగారెడ్డి మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు ఇద్దరేసి చొప్పున బరిలో ఉండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బి-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులకు మిగిలిన ఆశావహులు పూర్తి మద్దతు ప్రకటించాలని, అప్పుడే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రెబల్ అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నాయి. ఒకవేళ పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా పోటీలో నిలిస్తే, భవిష్యత్తులో పార్టీలో వారికి స్థానం ఉండదనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. సదాశివపేట, సంగారెడ్డిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని, ఐకమత్యంతో ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ హెచ్చరికల తర్వాత ఎంతమంది వెనక్కి తగ్గుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa