హిందువులు ఎంతో పవిత్రంగా ఆచరించే రథసప్తమి వేడుకలు శనివారం నిర్వహించుకుంట నేపథ్యంలో ఒక్కసారి రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇతర మాసములోని సప్తమి తిథులు కన్నా మాఘమాసములోని సప్తమి తిథి చాల విశిష్టమైన పండుగ. సూర్యజయంతి, భాస్కరజయంతి కూడా ఈ రోజే. స్వామి వారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి వారి పాదాలకు నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు మార్పు చెందే కాలంలో కుడా సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. సూర్యనారాయణస్వామిని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ప్రతిరోజూ భక్తులు భక్తీ శ్రద్దలతో స్వామివారిని ఆరాధించి రోగావిముక్తులై అవుతుంటారు.
రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమనుంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము. సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారు భారతీయులే.
ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామివారిని పూజించాలి
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్
ఈ రోజే ముత్తయిదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోము ఈ రోజు మొదలుపెడతారు. రథసప్తమి రోజున ఎటువంటి పనులు తలపెట్టిన విజయం చేకూరుతుంది. ఆ రోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు నువ్వులనూనె రాసుకుని రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిన పెట్టుకుని “ఓం సూర్య దేవాయ నమః” అని స్వామి వారిని మనసులో తలుచుకుని స్నానం ఆచరిస్తే కామ క్రోధాది గుణములు అన్ని తొలగుతాయి. జిల్లేడుకు రవి, ఆర్క ఆనే పేర్లు కూడా ఉన్నాయి. సూర్యని కోసం అర్చనలు చేస్తాం కాబట్టి జిల్లేడు ఆకులకు ప్రాధాన్యత వచ్చింది. తరువాత చిక్కుడు ఆకులను రధము ఆకారములో తయారుచేసి ఆవు పాలతో తయారుచేసిన పొంగలిని స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. చిక్కుడు ఆకులో ఉండే పసరు ఆరోగ్యానికి మంచిది. మొత్తం మీద రథసప్తమి పాటించడం ఎంతో శ్రేయో దాయకమని చెప్తుంటారు.
తిరుపతిలో కూడా శ్రీ వేంకటేశ్వరుని రధసప్తమి రోజున మొదట సుర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనం పై ఊరెగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెదసేషవాహన, కల్పవృక్ష వాహన, స్వయంభూపాల వాహనములపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా అదే రోజు చేస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని ఎంతో కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని కనులారా దర్శించుకుని ఆనందపడతారు.
సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం.