అనాథలకు ఢిల్లీ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. రానున్న విద్యా సంవత్సరం నుండి అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అనాథ విద్యార్థులకు అదనపు కోటా కింద 2 సీట్లను అందిస్తుంది. అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వర్గానికి చెందిన విద్యార్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానం ఆమోదించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో అనాథల ప్రవేశానికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని అధికారులు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి విశ్వవిద్యాలయంలో ఇది అమలువుందని అధికారులు ప్రకటించారు.
యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను చెల్లించడం నుండి మినహాయింపు ఇచ్చారు. హాస్టల్ ఫీజు, పరీక్ష రుసుము, ఇతర తప్పనిసరి రుసుము నుండి మినహాయింపు అందిస్తారు. అటువంటి విద్యార్థుల అడ్మిషన్, విద్య ఖర్చును విశ్వవిద్యాలయ సంక్షేమ నిధి లేదా కళాశాల విద్యార్థి సంక్షేమ నిధి నుండి చెల్లిస్తారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు చాలా ప్రయోజనం పొందుతారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.