నేటి నుండి భారత్, వెస్టిండీస్ ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు తొలి టీ20 జరగనుంది. భారత జట్టు ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లు గెలిచి ఉత్సాహంగా ఉండగా, వెస్టిండీస్ టీ20 సిరీస్ అయినా గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20లో మెరుపులు మెరిపించిన వెండీస్ జట్టును ఓడించాలంటే భారత కుర్రాళ్ల జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీ20లో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పటికే రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టింది. సాధ్యమైనంత వరకూ ఎక్కువ మందిని ట్రై చేయనున్నారు. టెస్టుల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ టీ20ల్లోనూ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్ రానున్నాడు. ఈ టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ వైస్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మిడిలార్డర్ లో ఈ సీనియర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున దుమ్ము రేపిన హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.