వన్డేలు, టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న టీమిండియా సారథి రోహిత్‌శర్మ టీ20ల్లో మాత్రం కనిపించడం లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి రోహిత్ దూరంగా ఉంటుండడంతో టీ20 కెప్టెన్సీని తాత్కాలికంగా మరొకరికి అప్పగించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ అసలు టీ20 ఆడే అవకాశమే లేదన్న ప్రచారం జరుగుతోంది. టీ20లకు రోహిత్ దూరంగా ఉండడం వెనక ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు.
అతడికి ఇప్పటికే 36 ఏళ్లు నిండాయి. ఏడాదిగా ఒక్క టీ20 కూడా ఆడని రోహిత్ ఇప్పుడు తిరిగి టీ20లు ఆడాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాదు, తాను ఇంకా కొనసాగడం ద్వారా కుర్రాళ్లకు అడ్డంకిగా ఉండాలని అనుకోవడం లేదని చెప్పినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదని, వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టడంతో రోహిత్ ఏడాదిగా టీ20లకు దూరంగా ఉంటున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చించిన తర్వాతే టీ20లకు దూరంగా ఉండలని రోహిత్ నిర్ణయించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.