గత ప్రభుత్వం ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. డీజీపీతో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘విద్యార్థులు పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల విధి. వారిని హింసించడం, ఇతర పనులు అప్పగించడం చేయరాదు. కానీ, గత ప్రభుత్వం బాత్‌రూమ్‌ల ఫొటోలు వారితోతీయించింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని రద్దుచేశాం’’ అని లోకేశ్ తెలిపారు. కేసులు లేకుండా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
‘‘1994 నుంచి టీడీపీ ప్రభుత్వంలో 15 డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చాం. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 2.20 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేస్తున్నామనీ, అందులో 1.80 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సెలవిచ్చారు. ఎన్నికలకు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు 6100 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. డీఎస్సీ ద్వారా జగన్ భర్తీ చేసిన పోస్టులు సున్నా’’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే మాధవి కోరగా, ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద పరిశీలనలో ఉందని లోకేశ్ చెప్పారు.