గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన మద్దిపాడు, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు రూరల్ మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో జడ్పీ, జిల్లా పంచాయతీ అధికారులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలన్నారు.
ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే పరిశీలించాలన్నారు. గ్రామాల్లో సీడబ్ల్యూసీల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా అధికారులు, ఉద్యోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల్లో సీడబ్ల్యూసీల నిర్వహణకు నిధుల కొరత ఉందని కృష్ణతేజ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఉద్యోగులు పలు రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.