రిలయన్స్ సంస్థ రూ.130 కోట్లతో ఏర్పాటు చేయనున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూమిని ఆసంస్థ ప్రతినిధి బృందం శుక్రవారం పరిశీలించింది. ,ప్రకాశం జిల్లా, పీసీపల్లి మండలంలోని పెదఇర్లపాడు రెవెన్యూలో సర్వే నెంబరు 652లో 475.57ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది నిమ్జ్ ప్రాంతంలో ఉంది. రిలయన్స్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కె.శివరామకృష్ణ తహసీల్దార్ సీహెచ్ ఉషతో కలిసి ఆ భూమిని పరిశీలించారు. అక్కడ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్న భావనకు వచ్చినట్లు సమాచారం. డిసెంబరు 28న ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో రిలయన్స్ ప్రతినిధులు భూసేకరణతోపాటు ఇతర పనులను వేగవంతం చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.