భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి రితిక శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ కూతురు(సమైరా) ఉన్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా రితికా బాబుకు జన్మనివ్వడంతో రోహిత్ శర్మ కుటుంబం సంబరాల్లో మునిగితేలింది. అటు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ కూడా 'రోహిత్ వారాసుడొచ్చాడోచ్..' అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ, రితికాల ప్రేమ వివాహం 2015, డిసెంబర్ 13న ఘనంగా జరిగింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2018, డిసెంబర్ 30న ఓ పాప పుట్టింది. ఆమెకు సమైరా అని నామకరణం చేసిన విషయం విదితమే.ఇక రితికా డెలివరీ విషయంపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు నుంచి తనను మినహాయించాలని రోహిత్ శర్మ బీసీసీఐను కోరిన సంగతి తెలిసిందే. దానికి బోర్డు కూడా అంగీకారం తెలిపింది. దీనిపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కావడం ఇదేం కొత్త కాదు.. గతంలోనూ విరాట్ కోహ్లీ సిరీస్ మధ్యలోనే తండ్రయిన సందర్భం లేకపోలేదు. కాగా, ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారని వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. భారత జట్టుకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి.