ప్రకాశం జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలోని రైతుల్లో ఈ పదవులకు మంచి గుర్తింపు ఉండటంతో అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి నాయకులు దృష్టి సారించారు. పలుప్రాంతాల్లో పోటీ కూడా కనిపిస్తోంది. మూడు దశలుగా ఈ ఎన్నికలు జరుగుతాయి.
చిన్న, మధ్యతరహా నీటి వనరులు, భారీ ప్రాజెక్టులకు విడివిడిగా కమిటీలు ఉంటాయి. జిల్లాలో మొత్తం క్షేత్రస్థాయిలో 342 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏలు) ఉండగా అందులో 240 చిన్ననీటి వనరులైన చెరువుల స్థాయిలో, 14 మధ్యతరహా నీటి వనరుల పరిధిలో, మిగిలిన 88 సంఘాలు ఎన్‌ఎస్‌పీ పరిధిలో ఉన్నాయి. ఎన్‌ఎస్‌పీలో పది మంది డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లను ఎన్నుకుంటారు. మధ్యతరహా ఇరిగేషన్ కింద ఉన్న కంభం చెరువు, పీబీ ఆనకట్ట, మోపాడు రిజర్వాయర్‌లకు కమిటీలు ఏర్పాటు చేస్తారు. వీటిని ఆ పరిధిలోని డబ్ల్యూయూఏల ద్వారా ఎన్నుకుంటారు.