ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మద్రాస్ ఐఐటీ బాసటగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు చేదోడుగా నిలవడానికి ముందుకొచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో ఎనిమిది ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మద్రాస్ ఐఐటీ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ తదితరుల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. వీటిల్లో ప్రధానంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి సాంకేతిక సలహాలు అందించడం, యువతకు స్కిల్ డెవల్‌పమెంట్‌లో నాణ్యత పెంచే కార్యక్రమాలు చేపట్టడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, విశాఖను ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం తదితర ఒప్పందాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి తాము ఉత్సాహంగా ఉన్నామని మద్రాస్ ఐఐటీ బృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, ఎం.రామప్రసాదరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, సీఈవో ఎంజె శంకరనారాయణ్ తదితరులు పాల్గొన్నారు.