రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది అని వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. వారు మాట్లాడుతూ.... ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది.
తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అని తెలిపారు.