సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వర్రా రవీంద్రారెడ్డిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కడప కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్రాపై నమోదవుతున్న కేసులన్నింటినీ పులివెందుల స్టేషన్‌కు బదిలీ చేస్తున్నారు. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు వర్రాను పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, వర్రా రవీంద్రారెడ్డిని ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు శుక్రవారం పత్తికొండ కోర్టులో హాజరు పరిచారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితతో పాటు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలపై వర్రా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు చేశారు.
టీడీపీ నాయకులు, మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. దీంతో రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 8న ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హరికృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో వర్రాపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు... కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మిగనూరు కోర్టు న్యాయాధికారి సెలవులో ఉండటంతో పత్తికొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప సెంట్రల్ జైల్‌కు తరలించారు. కాగా, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిలు కోసం కడప కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.