రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ఠ ఎత్తులో నిర్మించి, 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగులు జలాలను రాష్ట్రమంతటికీ అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అలాగే 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధులు కేటాయించేలా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సమ్మతి కోరేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏటా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇస్తున్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను సంపూర్ణంగా ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరులో నిర్మించేందుకు గత జగన్ ప్రభుత్వం అంగీకరించింది.
దీనివల్ల 115 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. పోలవరం సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఈ నెల ఐదో తేదీన వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పోలవరం ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ రామ్‌సుందర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, కృష్ణా డెల్టా, పోలవరం, గోదావరి డెల్టా, ఒంగోలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం మినిట్స్‌ను శుక్రవారం విడుదల చేశారు.