టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇటీవలే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతూ గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌లో సగం టోర్నీ నుంచే తప్పుకున్న పాండ్యా.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే అతడు తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చేది మార్చి మాసాంతంలోనే అని తెలుస్తున్నది. టీ20లలో భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనే తిరిగి రానున్నట్టు సమాచారం. భారత జట్టు త్వరలోనే ఆసీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత జనవరిలో స్వదేశంలో అఫ్గాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కానీ హార్ధిక్ మాత్రం నేరుగా ఐపీఎల్‌లోనే ఆడనున్నట్టు తెలుస్తున్నది.
ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్న హార్ధిక్.. వరల్డ్ కప్ నాకౌట్ దశకు ముందే వైదొలిగాడు. అతడు ఆసీస్‌తో సిరీస్ వరకు కోలుకుంటాడని భావించినా అదీ జరగలేదు. పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరమని, వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాండ్యాను మధ్యలో ఆడించి గాయాన్ని పెద్దది చేసేదానికంటే ప్రస్తుతానికి అతడికి విరామమిచ్చిందే బెటర్ అన్న యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగూ మార్చి మాసాంతంలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో ఈ లీగ్‌లో ఫామ్ అందుకుని ప్రపంచకప్‌కు నేరుగా బరిలోకి దిగొచ్చని హార్ధిక్ భావిస్తున్నాడు.