రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగారు. దీంతో ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి బౌలర్లు నలుగురే ఉండటంతో.. బరువంతా వీరిపైనే ఉంటుంది. అశ్విన్ స్థానంలో ఫీల్డర్‌ను మాత్రమే టీమిండియా మోహరించుకోగలదు. ఇప్పటికే దూసుకెళ్లున్న ఇంగ్లాండ్‌ను ఈ పిచ్‌పై అశ్విన్ లేకుండా అడ్డుకోవడం భారత్‌కు తలకు మించిన భారమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసి టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఈ ఘనత సాధించిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టు మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రవిచంద్రన్ అశ్విన్ టెస్టు జట్టు నుంచి తక్షణమే వైదొలిగినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో బీసీసీఐ, టీం ఇండియాలు అశ్విన్‌కు పూర్తిగా మద్దతిస్తామని తెలిపాయి. అయితే అశ్విన్ తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు సమాచారం. X లో ఒక పోస్ట్‌లో, BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, "ఆర్ అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతను తన తల్లితో ఉండటానికి రాజ్‌కోట్ టెస్ట్ తర్వాత చెన్నైకి బయలుదేరాలి" అని అన్నారు.