మన ఫోన్‌కు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. కాంటాక్ట్స్‌లో ఉన్న వారే కాకుండా.. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తుంటాయి. వాళ్లు ఫ్రెండ్స్ లేదా బంధువులు అయితే పర్లేదు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తుంటాయి. క్రెడిట్ కార్డుల కోసం, లోన్ ఇస్తామని ఒకరు.. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని కొందరు.. ఇలా నమ్మిస్తుంటారు. అందులో వాస్తవమేదో.. నకిలీది (ఫ్రాడ్) ఏదో కనిపెట్టడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు అమాయకులే ఎరగా ఓటీపీలు పంపి లక్షలు కాజేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దీనికి చెక్ పెట్టడం కుదరట్లేదు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత టెలికాం విభాగం సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది.
నకిలీ కాల్స్ గుర్తించే విధంగా ఒక కొత్త వ్యవస్థ రూపొందించింది డాట్. 160 తో ప్రారంభమయ్యే ఒక 10 అంకెల నంబర్ సిరీస్ తీసుకొచ్చింది. ఇక మీదట ప్రభుత్వ, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల నుంచి వచ్చే కాల్స్‌కు ముందు ఈ నంబర్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి.
10 అంకెల నంబర్ 160 ప్రీఫిక్స్‌తో పాటు.. 1600ABCXXXX ఫార్మాట్లో ఉంటుంది. టెలికాం నియంత్రణ సంస్థలు సహా.. ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కాల్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫార్మాట్లో AB స్థానంలో టెలికాం సర్కిల్ కోడ్ ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ అయితే 11, ముంబైకి 22 ఉంటుంది. C- స్థానంలో ఉండే అంకె టెలికాం ఆపరేటర్ కోడ్ అన్నమాట. XXX స్థానంలో 000 నుంచి 999 వరకు నంబర్లు ఉంటాయి.
సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్ఆర్‌డీఏ, ఆర్బీఐ వంటి నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే కంపెనీల నుంచి 1601ABCXXX ఫార్మాట్‌తో ఉండే పదంకెల సంఖ్య నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పొచ్చు. ఈ కొత్త విధానంతో యూజర్స్‌కు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందే తెలుసుకోవచ్చు. ఈ 160 సిరీస్‌తో కూడిన నంబర్స్ జారీ చేసే ముందుగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (TSP) ఆయా సంస్థల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ధ్రువీకరించుకోవాలని సూచించింది డీఓటీ.