ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి అందించే పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో నష్ట భయం ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుంటారు. అలాగే కొందరు పన్ను ఆదా చేసేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారు. అయితే, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాకిన్ ఇన్ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు కచ్చితంగా పొదుపు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో లాక్ ఇన్ పీరియడ్ 5 ఏళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
లోన్లతో పోలిస్తే డిపాజిట్లు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది భారంగా మారుతున్నట్లు బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లు తగ్గుముఖం పట్టడంపై బ్యాంకులు ప్రభుత్వానికి తాజాగా విన్నవించాయి. అందులో ప్రస్తుతం ట్యాక్సే సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు నిర్దేశించిన కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని కోరినట్లు బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 12.9 శాతం వృద్ధి నమోదు కాగా, లోన్లు 16.3 శాతం మేర పెరిగాయి.
సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్స్ ఈక్విటీ లింక్డ్ పొదుపు పథకాల వంటివి మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వాటి వేపై మొగ్గుచూపుతున్నారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. పన్ను ఆదా పథకాలు అన్నింటికీ 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడన్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా బ్యాంకులు గుర్తు చేశాయి. ఈ క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లకు తగ్గిచాలని, దీంతో నిధుల కొరత సమస్యను అధిగమనించవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. మరి బ్యాంకుల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.