వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించాల్సిన పన్నుల కంటే ఎక్కువ చెల్లించినప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ పొందేందుకు అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి జులై 31, 2024 లోపు ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా రిఫండ్ లభిస్తుంది. ఈ గడువు దాటితే పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అది కూడా తమకు రావాల్సిన రిఫండ్ నుంచే ఐటీ శాఖ కట్ చేసుకుంటుంది. అలాగే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం నిర్దేశిత నగదు కోసం ఐటీఆర్ ఫైల్ చేసినప్పటికీ రిఫండ్, వడ్డీ రాదు. మరి ఆ అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని ప్రాసెస్ చేసి రిఫండ్ చెల్లిస్తుంది ఐటీ శాఖ. మీరు రిఫండ్ పొందేందుకు అర్హులైనప్పుడు చెల్లించాల్సిన రిఫండ్ ఆలస్యమైతే నిర్దేశిత వడ్డీ రేటుతో వడ్డీ, రిఫండ్ కల్పి చెల్లిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ వడ్డీ అనేది చెల్లించరు. సాధారణంగా జాప్యం జరిగితే రిఫండ్లపై నెలకు 0.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రిఫండ్ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత సెక్షన్ 143(1) ప్రకారం ఎంత రిఫండ్ వస్తుందనేది సమాచారం అందిస్తారు. అయితే, మీరు చెల్లించిన ట్యాక్సులో మీకు రావాల్సిన రిఫండ్ 10 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు మీకు వడ్డీ అనేది చెల్లించరు. 10 శాతం రిఫండ్ లేకపోతే సెక్షన్ 244ఏ ప్రకారం వడ్డీ అనేది ఉండదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.
పన్ను నిపుణులు తెలిపిన వివరాలు ప్రకారం.. పన్ను డిమాండ్ రూ.100 కన్నా తక్కువ ఉంటే ఐటీ శాఖ కట్టాలని కోరదు. అదే విధంగా రిఫండ్ రూ.100 కన్నా తక్కువగా ఉన్నప్పుడూ వాటిని జారీ చేయదు.ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్ ప్రాసెస్ పూర్తి చేస్తుంది. ఏదైనా తప్పులు ఉంటే వాటికి అనుగుణంగా పన్ను సవరిస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ పన్ను కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడం, ఆ పన్ను రూ.100 కంటే తక్కువగా ఉంటే వాటిని కట్టాలని ఐటీ శాఖ కోరదు. మాఫీ చేస్తుంది. అదే విధంగా ప్రాసెసింగ్ పూర్తయి చెల్లించాల్సిన రిఫండ్ రూ.100 కంటే తక్కుగా ఉన్నప్పుడు ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి రిఫండ్ అనేది చెల్లించరు.
ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు దగ్గరపడుతోంది. జులై 31వ తేదీలోపు ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయలేకపోతే రూ.5 వేల వరకు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. కొన్ని సార్లు లీగల్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే 5 కోట్ల మంది తమ రిటర్నులు దాఖలు చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే గడువులోపు ఫైల్ చేయడం మంచిది.