ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత కరోనా తర్వాతి కాలంలో తెలిసొచ్చింది. ఇంకా కుటుంబ సంరక్షణ కోసం ఆరోగ్య బీమా పాలసీ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఇంకా ఆదాయపు పన్ను చట్టం - 1961లోని సెక్షన్ 80డి ద్వారా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించినటువంటి అన్ని పరిమితులు, నిబంధనలకు లోబడి టాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. అయితే ఇన్‌కంటాక్స్ యాక్ట్‌లోని సెక్షన్- 80డి తో పన్ను మినహాయింపులు ఎంత పొందొచ్చు.. ఎలా పొందొచ్చు అనేది తెలుసుకుందాం.
>> 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి (భార్య, పిల్లలతో కలిపి) హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్లపై సెక్షన్ 80డీ ద్వారా గరిష్టంగా రూ. 25 వేల వరకు పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇంకా పన్ను మినహాయింపు కోసం మీరు ఉద్యోగం చేసే సంస్థకు తగిన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ద్వారా కూాడా ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు వీలు ఉంటుంది.
>> వీరితో పాటుగా 60 సంవత్సరాలు దాటిన వారు కూడా ఆరోగ్య బీమా చెల్లింపులపై సెక్షన్ 80డి కింద గరిష్టంగా రూ. 50 వేలు పన్ను తగ్గించుకోవచ్చు. పైన చెప్పిన విధంగానే ఈ మినహాయింపు అనేది వ్యక్తిగత లేదా ఫ్లోటర్ పాలసీకి వర్తిస్తుంది.
>> పాలసీలో 60 సంవత్సరాల వయసు లోపులో భార్య, భర్త, పిల్లలు ఉండి.. 60 ఏళ్లు దాటిన కేటగిరీలో తల్లిదండ్రులు ఉన్నట్లయితే గరిష్టంగా రూ. 75 వేల వరకు (అంటే రూ. 25 ప్లస్ రూ. 50 వేలు) హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై ఈ సెక్షన్ అనుగుణంగా పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది.
>> ఈ పాలసీలో 60 సంవత్సరాలు దాటిన భార్య, భర్త, పిల్లలు, 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు ఉంటే గరిష్టంగా రూ. లక్ష వరకు కూడా ఆరోగ్య బీమా పేమెంట్స్‌పై పన్ను తగ్గించుకోవచ్చు. 80 డి కింద ఆరోగ్య పరీక్షల కోసం రూ. 5 వేల వరకు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది.
>> చివరగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆరోగ్య సంరక్షణతో పాటుగా పన్ను కూడా ఆదా చేసుకోవచ్చన్నమాట. మీరు బీమా హామీ ఎంత తీసుకోవాలి అనేది వ్యక్తిగత స్థితిగతులు, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు వంటి వాటి మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మీరు మీ ఆదాయాన్ని, ఇతర పరిస్థితుల్ని బట్టి అంచనా వేసుకోవాలి.