పారిస్ ఒలింపిక్స్ లో ఆశలు నీరుగారిపోతున్నాయి. ఇంతవరకు అద్భుతంగా ఆడిన హాకీ జట్టు సరిగ్గా ఆడాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్ లో భారత్ 2-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్ కి చేరాలన్న కోరిక చెదిరిపోయింది. అయితే జర్మనీతో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడింది. వన్ సైడ్ గా ఓటమిని అయితే అంగీకరించలేదు. అదొక్కటి భారతీయులకు ఊరట. అయితే ఒలింపిక్స్ లో మనవాళ్లు ఫైనల్ కి చేరి 44 ఏళ్లు అవుతోంది. ఇప్పుడా కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి వరకు హర్మన్‌ప్రీత్ సేన పోరాడింది. కీలక సమయంలో చేసిన తప్పిదాలు భారత్ కొంపముంచాయి. ఇక కాంస్యం కోసం రేపు గురువారం స్పెయిన్ తో తలపడాల్సి ఉంది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషం), సుఖ్‌జీత్ సింగ్ (36వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు.. జర్మనీ తరఫున గొంజాలో పెయిలట్ (18వ నిమిషం), క్రిస్టోఫర్ రుహుర్ ( 27వ నిమిషం), మార్కో మిల్ట్‌కావు ( 54వ నిమిషం)లో గోల్స్ సాధించారు. మరో గోల్ కోసం మనవాళ్లు చివరి వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ గైర్హాజరీ టీమిండియా కొంపముంచింది. క్వార్టర్ ఫైనల్లో రెడ్ కార్డ్ ఎదుర్కొన్న అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ఈ నిర్ణయం భారత్ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాలి. అత్యుత్సాహమే భారత్ కొంప ముంచిందని అంటున్నారు. ఎందుకు ప్రత్యర్థి జట్లతో గొడవలు పడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అద్భుతంగా ఆడిన మన జట్టు.. అర్థం లేని ఈగోల వల్ల.. నేడు ఫైనల్ లో స్వర్ణం లేదా రజత పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయిందని అంటున్నారు.