నేడు కొలంబో వేదికగా ఇండియా vs శ్రీలంక తలపడ్డాయి. ఈ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.శ్రీలంక నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో రెండు మ్యాచుల్లో గెలుపొందిన శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. కుశాల్ మెండీస్(82 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక(65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లతో మెరిశాడు. మొహమ్మద్ సిరాజ్ తేలిపోయాడు. 9 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఆరంభంలో సిరాజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు రోహిత్ శర్మ శుభారంభం చేశాడు. గిల్ (6)తో కలిసి తొలి వికెట్ కు 37 పరుగులు జోడించాడు. అనంతరం గిల్ అవుటయ్యాడు. కాసేపటికే రోహిత్ కూడా పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ (20) నిరాశ పరిచాడు. రిషభ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. దూబే (9) మరోసారి విఫలం అయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ పోరాడటంతో భారత్ 130 పరుగుల మార్కును దాటగలిగింది. లేదంటే ఇంకా తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయ్యి ఉండేది.