పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫొగాట్ రౌండ్ 16, క్వారర్స్, సెమీఫైనల్ మ్యాచ్‌లకు ముందు వినేష్ ఫొగాట్ బరువు 50 కిలోల కంటే తక్కువే ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు మాత్రం అంతకంటే ఎక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం 100 గ్రాములు అదనపు బరువు కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య స్పందించింది. సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్.. వినేష్‌కు అండగా నిలిచారు.
‘రెజ్లింగ్ ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసిన వినేష్‌పై అనర్హత వేటు పడటం దురదృష్టకరం. ఆటతో సంబంధం లేకుండా బరువు విషయంలో ఇలా జరగడం బాధాకరం. కానీ ఇందులో వినేష్ ఫొగాట్ తప్పు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆమె బరువు గత రెండు రోజులుగా స్థిరంగా అంటే 50 కిలోల లోపే ఉంది. కానీ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి ఆమె బరువు పెరిగిపోయింది. రాత్రికి రాత్రి ఇలా బరువుపెరగడమేంటి? ఇందుకు గల కారణాలు ఆమె కోచ్, పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలి’ అని సంజయ్ సింగ్ అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినేష్ ఫొగాట్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన.. అనంతరం మాట్లాడారు. రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల పని అని ఆయన అన్నారు. ‘రెజ్లర్ల కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వారంతా పారిస్‌కు సెలవుల కోసం వెళ్లారా?’ అని సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులను పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు.