భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరాజ్ చోప్రా మరో రికార్డు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజత పథకం అందించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో పతకం గెల్చుకున్నాడు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే తొలి రజతం కావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం వచ్చిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. పారిస్ ఒలింపిక్స్ లో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు విసిరాడు. దీంతో రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం 12 మంది పోటీపడగా..పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీట్లరు విసరి స్వర్ణం సాధించాడు. అలాగే మూడో స్థానంలో నిలిచిన గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్‌కు కాంస్యం వరించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించడంతో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన నాలుగో భారతీయుడిగా నీరాజ్ చోప్రా నిలిచాడు. అంతకుముందు సుశీల్ కుమార్(2008, 2012), పీవీ సింధు(2016, 2020), మనూ భాకర్(2024) అతని కంటే ముందున్నారు. మనూ ఈ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలుచుకుంది. కాగా, నీరాజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోగా.. ఈ సారి రజతంతో సరిపెట్టుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సిల్వర్ సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. మరోసారి అద్భుత ప్రదర్శన చేశారని కితాబిచ్చారు. ఈ పతకంతో భారత్ పొంగిపోయిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అథ్లెట్లు తమ కలల సాకారం చేసుకునేందుకు నీరాజ్ ప్రేరణగా ఉంటారన్నారు.