హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ హాస్పిటల్స్ గ్రూప్ స్టాక్ వరుస ట్రేడింగ్ సెషన్లలో రాణించి సరికొత్త గరిష్ఠ స్థాయని తాకింది. అందుకు ప్రధాన కారణం సెప్టెంబర్ 13వ తేదీన షేర్లు ఎక్స్-స్ప్లిట్ ట్రేడ్ చేయడమే. తమ స్టాక్స్ అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో స్టాక్ స్ప్లిట్‌కి ఆమోదం తెలుపింది కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్.
ఈ స్టాక్ స్ప్లిట్‌కి సంబంధించిన రికార్డు తేదీని సెప్టెంబర్ 13, 2024గా నిర్ణయించగా.. శుక్రవారం ఎక్స్-స్ప్లిట్ ట్రేడ్ చేసింది. ఈ షేరు గత రెండేళ్లలో 122 శాతం మేర లాభాన్ని అందించింది. ఇక స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం ఉన్న రూ. 554 ధరన నుంచి రూ. 110కు షేరు ధర తగ్గనుంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 3వ తేదీ నాటి ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్‌కి కంపెనీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. రూ. 10 ఫేస్ వ్యాల్యూ గల ఈక్విటీ షేరు రూ. 2 ఫేస్ వ్యాల్యూ గల 5 ఈక్విటీ షేర్లుగా విభజించనున్నారు. ఆగష్టు 29నవ తేదీన జరిగిన కంపెనీ 22వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల నుంచి సైతం ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 13 శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే నాటికి డీమ్యాట్ ఖాతాలో ఈ షేర్లు ఉన్న వారికి మాత్రమే ఈ స్టాక్ స్ప్లిట్ వర్తిస్తుంది.
స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో చూసుకుంటే కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ షేరు 1.21 శాతం లాభపడి రూ. 553.80 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 580 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 350 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 4 శాతం పెరిగింది. గత నెలలో 20 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 38 శాతం రిటర్న్స్ అందించింది. గత రెండేళ్లలో 112 శాతం లాభాలు ఇచ్చింది. గత మూడే 172 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 22,120 కోట్లుగా ఉంది. కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణలోని సికింద్రాబాద్ కేంద్రంగా హాస్పిటల్ చైన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలో మొత్తం 12 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ సంస్థను 2000వ సంవత్సరంలో ప్రారంభించారు.